నవయుగ ప్రవక్త పెరియార్
Posted On: Sunday,September 17,2017
పెరియార్ హేతువాద భావాలు చాలా తీవ్రమైనవి. ఆయన తన ఉద్యమాన్ని కూడా అంతే తీవ్రంగా నడిపించారు. 'దేవుని విగ్రహం గనుక ప్రజలు తాకటంతో మలినమైతే అలాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగులగొట్టి మంచి రోడ్ల నిర్మాణానికి ఉపయోగించాలి. అలా కాకపోతే నది ఒడ్డున వేసుకుంటే బట్టలుతకటానికైనా వాడుకోవచ్చు' లాంటి మాటలు ప్రజలను కొత్త దారిలో ఆలోచించేలా చేశాయి.
ప్రముఖ హేతువాది పెరియార్ జయంతిని సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. ఆయన ప్రచారం చేసిన
హేతువాద-నాస్తిక భావాలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు.
'మన జీవితాన్ని నడిపించే భౌతిక శక్తులేవో, వాటిని అనుకూలంగా ఉపయోగించుకునేందుకు అవసరమైన విజ్ఞాన మేమిటో అందరూ గ్రహించాలి.
అర్థంలేని మత విశ్వాసాలు, కాల దోషం పట్టిన ఆచారాలు, వాటిని వ్యాప్తిలో వుంచే సినిమాలు, సాహిత్యాలు, ఇతర క్షుద్రకళలు, దేవుళ్ళు, బాబాలు,
భక్తులు, ప్రచారాలు- లాంటి భూతాలు మన జీవితాలను పట్టి పీల్చి పిప్పి చేస్తున్నాయి. నాగరిక ప్రపంచంలో వీటికి స్థానం లేదు. వీటి నుంచి జాతి
విముక్తి పొందటమే గొప్ప అభ్యుదయం' అంటారు కొడవటిగంటి కుటుంబరావు. సరిగ్గా ఇలాంటి దృక్పథంతోనే సమాజం పట్ల గల మహత్తర బాధ్యతతో,
మనుషుల మీద వల్లమాలిన ప్రేమతో -సమస్త మూఢ విశ్వాసాల మీద, అర్థం లేని మతాచారాల మీద బుద్ధుని దగ్గరి నుంచి (అంతకు మందు చార్వాకుల
దగ్గరి నుంచి) నేటి రావిపూడి వెంకటాద్రి దాకా-పోరాడుతున్న వాళ్ళు అనేకులున్నారు. ఆధునిక యుగానికి సంబంధించినంతవరకు ఈ రంగంలో
ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తన నిండు జీవితాన్ని ధారపోసిన మొట్ట మొదటి వ్యక్తి పెరియార్. ఆయన పూర్తి పేరు ఈ రోడ్ వెంకట
రామస్వామి నాయకర. పెరియార్ ఆయనకు ప్రజలిచ్చిన బిరుదు. దీనర్థం పెద్దమనిషి -రుషి లేదా జ్ఞాని.
శాస్త్ర, సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందిన దశలో- డేరాబాబా లాంటి వాళ్లు పుట్టుకు రావడం, బంగారం -డబ్బులను రెట్టింపు చేస్తామని, మత్తు
పదార్థాలిచ్చి ఇల్లంతా లూఠీ చేయడం లాంటివి అనేకం జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుని చుట్టూ అల్లుకున్న విశ్వాసాల కారణంగా ముందుకు
వస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇట్లా వుంటే ఏ మాత్రం చదువు, శాస్త్ర విజ్ఞానం లేని 90 ఏళ్ళ కిందట ఎలా వుండేదో ఊహించడం అంత కష్టమైన పనేం
గాదు. అదిగో అలాంటి కాలంలో ప్రజలను చైతన్యం చేయటానికి ప్రధానంగా మూడు రంగాలను ఆయన ఎంచు కున్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా
పోరాడటం, మత విశ్వాసాలు- మూఢ నమ్మకాలు వల్ల కలుగుతున్న నష్టాల మీద ప్రచారం చేయడం, స్త్రీల హక్కుల గురించి పోరాడటం. ఈ మూడు
రంగాలకు సంబంధించినంత వరకు అపసవ్య ధోరణులున్నాయి. ఇవన్నీ సమాజానికి బ్రాహ్మణిజం నేర్పిన విలువల వల్ల ప్రతిఫలించినవే. దీంతో
సహజంగానే పెరియార్‌కు బ్రాహ్మణిజం ప్రధాన శత్రువయ్యింది. తరువాతి కాలంలోని కాళోజీలాగే తన జీవితకాలంలో ఎక్కువ సమయం కేటాయించింది
మాత్రం హేతువాద ప్రచారోద్యమం కోసమే.
పెరియార్ హేతువాద భావాలు చాలా తీవ్రమైనవి. ఆయన తన ఉద్యమాన్ని కూడా అంతే తీవ్రంగా నడిపించారు. 'దేవుని విగ్రహం గనుక ప్రజలు
తాకటంతో మలినమైతే అలాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగులగొట్టి మంచి రోడ్ల నిర్మాణానికి
ఉపయోగించాలి. అలా కాకపోతే నది ఒడ్డున వేసుకుంటే బట్టలుతకటానికైనా వాడుకోవచ్చు' లాంటి మాటలు ప్రజలను కొత్త దారిలో ఆలోచించేలా
చేశాయి. తీవ్రమైన విమర్శతో, పదునైన అభివ్యక్తితో-తన ప్రసంగాలు, రచనలు అనేక మందిని హేతు వాదులుగా మార్చాయి. 1925, నవంబరు 23న
ఆయన ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమం విస్తృతమైన కార్యక్రమాలు చేసి, ప్రజల మద్దతు విశేషంగా సంపాదించగలిగింది. అందులో భాగంగానే
బ్రాహ్మణులు, మంత్రాలు లేని పెళ్ళిళ్లకు రూపకల్పన చేశారు.
సకల మూఢవిశ్వాసాలకు కారణం మతం పేరిట చలామణిలో వున్న గ్రంథాలే. పెరియార్ ఆ కారణంగానే రామాయణాన్ని తీవ్రంగా విమర్శించేవారు.
దాన్ని ఆయన బూటకమైన చిత్ర విచిత్రమైన ఒక చెత్త చరిత్ర అనేవారు. అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేసిన విధంగానే పెరియార్ రామాయణ
గ్రంథాన్ని తగులబెట్టారు. ఒక వర్గం వారికి సమస్త ఆధిపత్యాలను ధారాదత్తం చేస్తూ- శూద్రులు, అతి శూద్రుల పేరిట 95 శాతం ప్రజలకు ఏ విధమైన
హక్కులు లేకుండా చేసి -వాళ్లు కుక్కలు, కాకులతో సమానమన్న విధంగా, జంతువుల కంటే తక్కువ చేసి చూపిన అలాంటి పుస్తకాలను ఆయన
వ్యతిరేకించారు. భావజాల పరంగా పెరియార్, అంబేద్కర్‌లు దాదాపు ఒకే కుదురుకు చెందిన వాళ్ళు. 1924-25లలో కేరళ రాష్ట్రంలోని వైక్కాం
దేవాలయ పరిసరాల్లోకి నిమ్నకులాల వాళ్ళను అనుమతించలేదు. ఇటువంటివే ఇతర రెండు మూడు సంఘటనల నేపథ్యంలో పోరాటాలు జరిగాయి. ఈ
సందర్భంలో బ్రాహ్మణీయ భావజాలన్ని గాంధీ సమర్థించారు. దీంతో ఆయన నుంచి దూరమవటమే కాక ఆయన నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా
విడిచిపెట్టారు. అంబేద్కర్ కూడా గాంధీ భావాలతో తీవ్రంగా పోరాడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరేమో అణగారిన వర్గాలవైపు నిలబడి పోరాడుతుంటే
తాతగారు ప్రజలను అణగదొక్కే వర్గాలవైపు వుండి వీళ్లను వీళ్ల ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నాలు చేయడం చరిత్రలో దాచినా దాగని సత్యం.
పెరియార్ తాను పుట్టిన తమిళనాడుతో పాటు దేశమంతా ముఖ్యంగా దక్షిణ భారతదేశమంతా పర్యటించి హేతువాద, నాస్తిక భావాలను ప్రచారం చేశారు.
ఉత్తర భారతీయులు దక్షిణ ప్రాంతమ్మీద చూపిస్తున్న అనేకరకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాటాలు లేవనెత్తారు. దక్షిణ భారతదేశమ్మీద హిందీ భాషను
బలవంతంగా రుద్దటానికి వ్యతిరేకంగా పోరాడారు. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా దక్షిణ భారతీయులందరినీ ఐక్యంగా వుంచడానికి ఆయన
పడిన శ్రమ చాలా గొప్పది. అందుకోసం 1921 నుంచి అత్యంత క్రియాశీల రాజకీయాలు నెరుపుతున్న 'జస్టిస్ పార్టీ' పేరును 1944 ఆగష్టు 27న
'ద్రవిడ కజగం'గా మార్చారు. దీన్ని సాంస్కృతిక రంగానికి మాత్రమే పరిమితం చేశారు. అనేక సందర్భాలలో తనకు రాజకీయా ధికారం కంటే
సంస్కరణోద్యమాలే ప్రధానమని ప్రకటించిన గొప్ప వ్యక్తి పెరియార్. ఇలాంటి అరుదైన వ్యక్తిని గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం- విద్యా
వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ(యునెస్కో) 1970 జూన్ 27న అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి త్రిగుణసేన్ ద్వారా సన్మాన పత్రాన్ని
బహూకరింపజేసింది. అందులో పేర్కొన్న విధంగానే పెరియార్- నవయుగ ప్రవక్త, ఆగేయాసియా సోక్రటీసు, సంఘసంస్కరణా పితామహుడు,
అజ్ఞానానికి, మూఢనమ్మకాలకు, అర్థరహితమైన ఆచార సాంప్రదాయాలకు ఆగర్భ శత్రువు.
- తోకల రాజేశం
సెల్ : 9676761415
No comments:
Post a Comment