Monday, April 13, 2020

నిర్బంధంలో అంబేడ్కర్‌ ఆత్మబంధువు

నిర్బంధంలో అంబేడ్కర్‌ ఆత్మబంధువు
ఇవ్వాళ కరోనా అందరినీ గృహ నిర్బంధంలోకి నెట్టింది. ఈ సందర్భం వల్లే సుప్రీంకోర్టు జైళ్లల్లో ఉండే ఖైదీలను సాధ్యమైనంత మేరకు కనీసం ఆరు వారాలు పేరోల్‌ మీద విడుదల చేయాలని ఆదేశించింది. దీంట్లో భాగంగానే మహారాష్ట్రలో పదకొండు వేల మందిని విడుదల చేసారు. చాలా ఆశ్చర్యంగా అటు ఒక ఆదేశం అమలులో ఉన్నప్పడే ఆనంద్‌ తేల్తుంబ్డే లాంటి వాళ్లకు అలాంటి ప్రమాణాన్ని కూడా అమలు చేయకుండా, లాయరు వాదనలు వినకుండా, ఒక వారం రోజుల్లో లొంగిపోవాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వారాంతం విచిత్రంగా డా. అంబేడ్కర్‌ జయంతి 14 ఏప్రిల్‌ అయ్యింది.

యాదృచ్ఛికమే ఐనా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 129వ జయంతి రోజే డా. అంబేడ్కర్‌ కుటుంబ సభ్యుడు ఆయన మేధో వారసుడు అరుదైన మేధావి ఆనంద్‌ తేల్తుంబ్డే జైలులోకి వెళ్ళవలసి రావడం ఒక పెద్ద చారిత్రక విషాదం. స్వాతంత్య్రానంతరంలో అతి పేద దళిత కుటుంబంలో పుట్టిన ఆనంద్‌ తెల్తుంబ్డే డాక్టర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో కేవలం తన స్వయంశక్తితో అత్యంత ప్రతిభావంతుడైన మేధావిగా ఎదిగాడు. బహుశా నాకు తెలిసి అంబేడ్కర్‌ రచనలను అంత క్షుణ్ణంగా చదివిన వారు చాలా తక్కువ. ఆనంద్‌ అంబేడ్కర్‌ను లోతుగా అధ్యయనం చేయడమే కాక మార్క్సిజాన్ని కూడా అంతే లోతుగా అన్వేషించాడు. మార్క్సిజం చారిత్రక, తాత్విక, నైతిక కోణాలని చాలా సమగ్రంగా చాలా నిశితంగా అధ్యయనం చేసాడు. చాలా ఆశ్చర్యంగా గాంధీజీ రచనలను కూడా చాలా గౌరవంగా చదవడమే కాక, గాంధీని భారత సమాజం మరింత పరిణతితో అంచనా వేయాలని వాదిస్తాడు. ఈ మూడు ఆలోచనా స్రవంతుల ప్రభావం ఆయన రచించిన 29 గ్రంథాలలో చూడవచ్చు. ఈ గ్రంథాలన్నీ ఆనంద్‌ మేధో శిఖరాలకి అద్దం పడతాయి.

ఆనంద్‌ చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. పేదరికం వలన సెలవుల్లో ఇళ్ళకు సున్నాలు వేసిన ఆదాయంతో చదువుకున్నాడు. ఆనంద్‌ తల్లిని కలిసినప్పుడు– మీ అబ్బాయికి చాలా పేరు ప్రతిష్టలున్నవి, మంచి అబ్బాయికి తల్లి మీరు అని అంటే అమాయకంగా నా ముఖమంతా తన చేతులతో అప్యాయంగా తరిచింది. మనసంతా ప్రేమతో నిండిన మనిషిలా అనిపించింది. ఆనంద్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు, ఆ తర్వాత బాంబే విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ చేసాడు. దాంతో బాటు ప్రతిష్ఠాత్మాకమైన అహ్మదాబాద్‌ ఐ.ఐ.యం నుండి మేనేజ్‌మెంట్‌లో పట్టా సాధించాడు. సాంకేతిక రంగంలో ఆధునిక ఐ.టి. రంగంలో మెగా అనలిటిక్స్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. కొంత కాలం బహుళ జాతి కంపెనీలో పని చేసి, భారత్‌ పెట్రోలియం కంపెనీలో ఎండిగా అలాగే సిఇఓగా పని చేసాడు. ఆయనకుండే అనుభవం వలన భారత ప్రభుత్వం ఆయనకు పెట్రోనెట్‌ ఇండియా లిమిటెడ్‌లో బాధ్యతలను అప్పచెప్పింది. ఈ అపార అనుభవం వలన ఆయనను మరో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటి ఖరగ్‌పూర్‌ ఆచార్యుడిగా ఆహ్వానించి, మేనేజ్‌మెంట్‌ ఎకనామిక్స్‌ బోధన బాధ్యతను అప్పచెప్పింది. అక్కడ విధులు నిర్వహిస్తున్నప్పుడే గోవా మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ మెగా డేటా అనలిటిక్‌ బోధించడానికి ఆహ్వానించింది. ఈ రంగంలో ప్రావీణ్యం కలిగిన కేవలం ఇరవై మంది నిష్ణాతులలో ఆనంద్‌ ఒకరు. నిజానికి ఈ అర్హతల వలన కర్ణాటక విశ్వవిద్యాలయము ఆయనకు గౌరవ డాక్టరేటునిచ్చి గౌరవించింది.

ఆనంద్‌ ఈ రంగాలకే పరిమితమై ఉంటే బహుశా భారత ప్రభుత్వం ఆయనకు పద్మ అవార్డులే ఇచ్చేది. చాలా మంది సాంకేతిక నిపుణుల వలే కేవలం తమ రంగం తప్ప దేనిని పట్టించుకునే మనస్తత్వం కాక, ఆనంద్‌కు ఉండే సామాజిక నేపథ్యం వల్ల సమాజంలో ఉండే వివక్ష, అసమానతలు, పేదరికం, కుల వ్యవస్థ, నిరుద్యోగం, భూమి సమస్య, ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద దోపిడీ, భూస్వామ్య సంబంధాలు, విద్య, వైద్యం లాంటి సమస్యల మీద స్పందిస్తూ ఒక వైపు తన సాంకేతికపర బాధ్యతలు నిర్వహిస్తూ నిరంతరంగా ఈ సమస్యలన్నింటి మీద రచనలు చేసాడు. ఉదాహరణకు ఆయన రచించిన ప్రామాణిక గ్రంథం ‘కైర్లాంజీ’ కేవలం పది రోజుల్లో అదీ చైనాలోని బీజింగ్‌ నుండి కెన్యాకు ప్రయాణిస్తూ విమానంలో, విమానాశ్రయంలో గడిపిన సమయంలో వ్రాసాడు. నవయానా అనే ప్రచు రణ సంస్థ బాధ్యుడు ఎస్‌. ఆనంద్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆనంద్‌ ఎంతో సృజనపరుడని పేర్కొన్నాడు.

బ్రాహ్మణీయ భావజాలం, కుల వ్యవస్థ, నియో లిబరలిజం, భూస్వామ్యం, అన్నింటికి మించి దేశంలో బలపడుతున్న ఫాసిస్టు శక్తుల మీద ఆయన లోతైన రచనలు చేయడమే కాక, దేశంలోని పేద వర్గాలని డా.అంబేడ్కర్‌ సూచించినట్లుగా ఎడ్యుకేట్‌ చేసే బాధ్యత నెత్తిన వేసుకున్నాడు. పేదవర్గాల మీద ప్రత్యేకంగా దళితుల మీద దాడులు జరిగితే తాను ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళ వైపు నిలబడ్డాడు. పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాతపల్లెలో దళితుల మీద బోయలు దాడి చేసినప్పుడు రెండు పర్యాయాలు రావడమే కాక వాళ్ళకు న్యాయం జరిగేలా కృషి చేసాడు. డా.అంబేడ్కర్‌ కుటుంబ సభ్యుడు వచ్చాడనేది పెద్ద వార్త అయ్యింది. నేను పాతపల్లికి వెళ్లినప్పుడు బోయలు అంబేద్కర్‌ మనుమడు వచ్చేంత పెద్ద నేరం మేం ఏం చేసాం అని అన్నారు. ఆనంద్‌ ప్రమేయం వల్ల జిల్లా యంత్రాంగం కూడా కదిలింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

ఇంత అరుదైన మనిషిని ఉపా చట్టం క్రింద అరెస్టు చేయడం ద్వారా రాజ్యం ఏ దిశగా పోతుందో స్పష్టంగా చూడవచ్చు. ఇంతకు ఆనంద్‌ చేసిన నేరమేమిటి, ఆయన మీద మోపిన నేరం భీమాకోరేగాం సంఘటనతో సంబంధమున్నదని, భీమాకోరేగాం మావోయిస్టు పార్టీ ప్రోద్బలంతో జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణ. భీమాకోరేగాం నిజానికీ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ రాజకీయ ఉద్యమ కృషిలో భాగం. దాదాపు రెండు శతాబ్దాల క్రితం బ్రాహ్మణ పీష్వాలను ఓడించిన బ్రిటిష్‌ సైన్యంలో దళితులు కీలక పాత్ర నిర్వహించారు. ఈ సంఘటన ద్వారా దళితుల్లో చైతన్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చని డా.అంబేడ్కర్‌ ఆలోచించారు. ఎన్నడు లేనిది 2018లోనే ఇది వివాదస్పదంగా మారింది. దానిని కేంద్ర, మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు వ్యతిరేకించి దేశంలోని పదకొండు మంది అత్యంత ప్రతిభావంతులను అరెస్టు చేసింది. జీవితంలో ఉన్నత విలువలని, ప్రమాణాలని ఆచరిస్తున్నవారు, వ్యవస్థతో రాజీ పడితే ఏ బిరుదులైనా, ఏ పదవులైనా పొందగలిగి జీవితంలో సుఖంగా జీవించగలిగే వారు ఈ విధంగా ఇవ్వాళ జైలులో బంధింపబడ్డారు. మొదట తొమ్మిది మందిని పునా పోలీసులు అరెస్టు చేసారు. ఇందులో ఆనంద్‌ తెల్తుంబ్డే, గౌతం నవాలాఖాలు బయట ఉండిపోయారు. ఆనంద్‌ విషయంలో బాంబే హైకోర్టు, అలాగే నవాలాఖా విషయంలో ఢిల్లీ హైకోర్టు కొన్ని సాంకేతిక లోపాల వలన స్టే ఇచ్చారు. ఈ స్టే కొనసాగుతున్న కాలంలోనే మహారాష్ట్రలో బిజెపికి అధికారం పోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భీమా కోరేగాం సంఘటన అలాగే ప్రధానమంత్రి మీద హత్యకు కుట్ర, అన్నవి కేవలం కల్పితమని ఇవి అమాయకుల మీద రుద్దబడ్డ కేసులని ఎన్‌.సి.పి. ప్రముఖుడు సీనియర్‌ నాయకుడు శరద్‌ పవార్‌ మేము ఆయనను కలసినప్పుడు మాతో అన్నాడు. ఈ కేసును తామే సమీక్షిస్తామని నిర్ణయించడంతో దాదాపు 18 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం కేసును మహారాష్ట్ర ప్రభుత్వ పరిధి నుండి తప్పించి తామే దీనిని ఎన్‌.ఐ.ఎ. ద్వారా డీల్‌ చేస్తామని తమ పరిధిలోకి తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత ఆనంద్‌ తెల్తుంబ్డే, గౌతం నవలఖాల స్టేను ఎత్తి వేయించి వాళ్ల అరెస్టుకు ఆదేశించారు.

ఆనంద్‌ అరెస్టును దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నోవ్‌ుచాంస్కీతో సహా చాలా మంది నిరసించారు. ఆయన అరెస్టు అవుతారనే వార్త రావడంతో దాదాపు పదిహేను వేల ట్వీట్స్‌ దానిని వ్యతిరేకిస్తూ రావడం చూస్తే ఆయనకుండే మద్దతు ఏంటో తెలుస్తుంది. ఆనంద్‌ అఖిల భారతీయ విద్యా హక్కు ఫోరంలో అధ్యక్ష వర్గ సభ్యుడు. ఈ ఫోరం ఆనంద్‌ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను చేపట్టింది. విద్య అందరికీ సమానంగా, నాణ్యంగా, ఉచితంగా అందుబాటులోకి రావాలని గత దశాబ్ద కాలంగా పోరాడుతున్నది. ఈ పోరాటంలో ఆనంద్‌ అగ్రభాగాన ఉన్నాడు. ఒకవైపు కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. మానవాళి భవిష్యత్తేమిటో తేల్చుకోమంటున్నది. ఒక కనిపించని నిర్జీవి ప్రపంచాన్నంతా జైళ్ళలోకి నెట్టింది. ఇంట్లో నుండి కదలడానికి వీల్లేదంటున్నది. భీమా కోరేగాం సంఘటనలో వరవరరావులాంటి మిత్రులను గృహనిర్బంధం అని కొంతకాలం ఇంట్లోనే నిర్బంధించారు. ఇవ్వాళ కరోనా అందరిని గృహ నిర్బంధంలోకి నెట్టింది. ఈ సందర్భం వల్లే సుప్రీంకోర్టు జైళ్లల్లో ఉండే ఖైదీలను సాధ్యమైనంత మేరకు కనీసం ఆరు వారాల పేరోల్‌ మీద విడుదల చేయాలని ఆదేశించింది. దీంట్లో భాగంగానే మహారాష్ట్రలో పదకొండు వేల మందిని విడుదల చేసారు. చాలా ఆశ్చర్యంగా అటు ఒక ఆదేశం అమలులో ఉన్నప్పుడే ఆనంద్‌ లాంటి వాళ్లకు అలాంటి ప్రమాణాన్ని కూడా అమలు చేయకుండా, లాయరు వాదించినా వినకుండా, ఒక వారం రోజుల్లో లొంగిపోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వారాంతం విచిత్రంగా డా.అంబేద్కర్‌ జయంతి 14 ఏప్రిల్‌ అయ్యింది. అంబేడ్కర్‌ మీద గౌరవ సూచనగా కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ‘‘ఒకవైపు అంబేద్కర్‌ మీద గౌరవం చూపిస్తూనే ఆయన కుటుంబ సభ్యుడిని జైలు పాలు చేయడంలో ప్రభుత్వ ద్వందత్వం కనిపిస్తుందని’’ అని ఆనంద్‌ అనడం అందరిని ఆలోచింపచేస్తున్నది. రాజ్యం తన స్వభావాన్ని తనకు తెలియకుండానే బహిర్గత పరుస్తుందనడానికి ఇంతకంటే పెద్ద సూచిక అవసరం లేదు.

ప్రొ. జి.హరగోపాల్‌

No comments:

Post a Comment